స్వేచ్ఛా విహంగం

Monday, April 30, 2007

బాబ్లీ వాదనలు

బాబ్లీ పై ఈనాడు సంపాదకీయం

దిగువ రాష్ట్రాన్ని దగా చేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల్లో బాబ్లీ ఒకటి. జలచౌర్యం నేరంపై మహారాష్ట్రను బోనులో నిలబెట్టి ఉతికి ఆరేసే ఆధారాలు పుష్కలంగా ఉన్నా, రాష్ట్రసర్కారు నిష్క్రియే బాబ్లీకి శ్రీరామరక్ష అవుతోంది! అసలు బాబ్లీకి నీటి కేటాయింపులు ఉన్నాయా అన్నది ఆంధ్రప్రదేశ్‌ సంధించాల్సిన తొలిప్రశ్న. అంతర్రాష్ట్ర ఒప్పందానుసారం తనకు కేటాయించిన 60టి.ఎం.సి.ల నీటినీ ఇప్పటికే వాడేసుకొంటున్న మహారాష్ట్ర ఏ హక్కుతో బాబ్లీ నిర్మిస్తోంది? పోచంపాడు ముంపు ప్రాంతంలో బాబ్లీని మహారాష్ట్ర నిర్మిస్తోంది. రిజర్వాయర్‌లో మరో ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగనిది! బాబ్లీ ప్రాజెక్టు కాదని కేవలం బ్యారేజి అనీ చెప్పి ఒప్పించడానికి మహారాష్ట్ర ప్రయత్నిస్తోంది. బ్యారేజి అనేది స్టోరేజికోసం కాదు. నీటి పంపింగ్‌ కోసం ఏర్పాట్లు చేయడంలో ఎగువ రాష్ట్రం కుట్ర దాచినా దాగదు! బాబ్లీ నిర్మాణం పూర్తి అయితే శ్రీరాంసాగర్‌ నీళ్లు రివర్స్‌ఫ్లోలో వెనక్కి వెళ్లిపోతాయన్న వాదనకే రాష్ట్రం పరిమితం కారాదని నిపుణులు మొత్తుకుంటున్నారు. మన రిజర్వాయర్లో నీళ్లు తోడేసుకోవడానికే బాబ్లీ నిర్మిస్తున్నారంటూ ఎలుగెత్తకుండా రివర్స్‌ఫ్లో ప్రస్తావనలతో సరిపుచ్చితే ఎలా? వై.ఎస్‌.సర్కారు వాదనల్లో ఇన్ని లొసుగులు ఉండబట్టే- గోదావరి జల ప్రవాహానికి ఆటంకం కల్పించరాదనే షరతుమీద బాబ్లీ నిర్మాణం కొనసాగింపునకు సుప్రీం అంగీకరించింది. రాష్ట్ర సౌభాగ్యంతో ముడివడిన ఇంత కీలకాంశంపై సహేతుక రాజకీయ పరిష్కారానికైనా ప్రయత్నాలు సాగుతున్నాయా అంటే, అదీ లేదు. బాబ్లీపై జలసంఘం నివేదిక రాగానే రెండు రోజుల్లో చర్య తీసుకొంటామని ప్రధాని హామీ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి ప్రకటించి మూడు వారాలు దాటింది. 'కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీని మహారాష్ట్రకు ఇబ్బందికరంగా మాట్లాడమని కోరడం మాకు మంచిది కాద'న్న వై.ఎస్‌.మాటల్లో ధ్వనిస్తున్నదేమిటి? ఇలా రాజకీయంగా రాజీపడుతూ, న్యాయపరంగా అసమర్థ నిర్వాకం వెలగబెడుతూ, ఆందోళన చేస్తున్న విపక్షాలవి ఏడుపుగొట్టు రాజకీయాలని ఎద్దేవాచేస్తూ- వై.ఎస్‌.ప్రభుత్వం బాబ్లీ కొరివితో రాష్ట్రం తలగోకుతోంది!

0 Comments:

Post a Comment

<< Home